కరోనా విపత్తులోనూ రోజువారీ తనిఖీలు జరిపాం...మంత్రి కొడాలి నాని

We also carry out daily inspections during the Corona disaster ... Minister Kodali Nani

nani kodali

గుడివాడ, జూన్ 9: రాష్ట్రంలో తూనికలు, కొలతల శాఖ ఒక వ్యూహంతో పనిచేయడం ద్వారా సత్ఫలితాలను సాధిస్తోందని, దీనిలో భాగంగా ఎవేర్నెస్, ఎడ్వైజ్, ఎడ్మానిష్, యాక్షన్ వంటి 4ఎ పద్ధతులను అనుసరిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.

బుధవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్, ఐజీపీ డాక్టర్ కాంతారావు నేతృత్వంలో రాష్ట్రంలో రీజియన్ల వారీగా ఖాళీలను భర్తీ చేయడం ద్వారా తూనికలు, కొలతల శాఖను బలోపేతం చేశామన్నారు. శాఖలో ఎన్ఫోర్స్ మెంట్ పనితీరు సక్రమంగా ఉందని చెప్పారు. గత ఏడాది మార్చి నెల్లో కరోనా మొదటి వేవ్ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆంక్షలను విధించాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా నిత్యావసర సరుకుల కొరత లేకుండా తూనికలు, కొలతల శాఖ అన్ని చర్యలూ తీసుకుందని తెలిపారు. ఎప్పటికపుడు నిత్యావసరాల అక్రమ నిల్వలపై ఆకస్మిక తనిఖీలను కూడా చేపట్టామన్నారు. కరోనా విపత్తును ఆసరాగా చేసుకుని వ్యాపారులు నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరామని చెప్పారు.'

రోజువారీ తనిఖీలతో ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలకు పాల్పడే దుకాణాలపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ లోనూ తూనికలు, కొలతల శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలు, నిత్యావసరాల అక్రమ నిల్వలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందిస్తున్నామని, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలకు వెనకాడడం లేదన్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంక్ ల్లో పెద్దఎత్తున తనిఖీలను జరిపి అందులో ఉన్న లోటుపాట్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళామన్నారు. భవిష్యత్తులో అక్రమాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను కేంద్రానికి వివరించామని తెలిపారు.

2019 ఆగస్టు నెల నుండి 4ఎ పద్ధతిని అవలంభిస్తున్నామని, మొదట అవగాహన కల్పించడం, ఆ తర్వాత సలహాలివ్వడం, అవసరమైతే మందలించడం జరుగుతుందని, చివరకు చర్యలకు దిగుతామని చెప్పారు. తూనికలు, కొలతల పరికరాలను ఉపయోగించే వ్యక్తులు, సంస్థలు విధిగా తమ పరికరాలను నిర్ణీత సమయంలో తూనికలు, కొలతల శాఖ వద్ద సమర్పించి నిర్ణీత ప్రమాణాలకనుగుణంగా సరి చేయించుకుని ముద్రలు వేయించుకునేలా చూస్తున్నామన్నారు. సరైన ముద్రలు లేకుండా తూనికలు, కొలతల పరికరాలను వినియోగించడం చట్టరీత్యా నేరమన్నారు. ప్యాకేజ్డ్ కమోడిటీస్ రూల్స్ ను సక్రమంగా అమలయ్యేలా చూస్తున్నామన్నారు. ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలకు పాల్పడే దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు జరుపుతూ కేసులను నమోదు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే బాధిత వినియోగదారుడు తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచామని మంత్రి కొడాలి నాని తెలిపారు.


Comment As:

Comment (0)