ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న మంత్రి

గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న మంత్రి కొడాలి నాని

kodali3

     గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానాన్ని 10 వేల మెజార్టీతో కైవసం చేసుకుంటాం.
 


గుడివాడ , ఏప్రిల్ 5 : గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానాన్ని 10 వేల మెజార్టీతో కైవసం చేసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడ్లవల్లేరు మండలం కవుతరం గ్రామంలో మంత్రి కొడాలి నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు . జడ్పీటీసీ అభ్యర్ధిని ఉప్పాల హారిక , కవుతరం రెండు సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థినులు ఈడే లక్ష్మి , ఎస్ దుర్గాభవాని , డోకిపర్రులోని రెండు సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్ధులు కొడాలి సురేష్ , మేరుగు నాగేంద్రరావులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు . అనంతరం జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడ్లవల్లేరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్ధినిగా ఉప్పాల హారికను నిలబెట్టామని చెప్పారు . గత ఏడాది కాలంగా ఇక్కడి ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు . కరోనా విపత్కర పరిస్థితుల్లో అనేక సేవాకార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు . తమ అభ్యర్ధి ఉప్పాల హారిక ప్రజా సేవ చేస్తుందనే నమ్మకం ప్రజలకు కల్గిందన్నారు . జడ్పీ , ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో మండలంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నామన్నారు . అన్నివర్గాల ప్రజల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తోందన్నారు . టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కొత్త నాటకానికి తెర తీశారని చెప్పారు . జడ్పీ , ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించినట్టు ఒకవైపు చెబుతూనే మరోవైపు జడ్పీటీసీ , ఎంపీటీసీ అభ్యర్థులతో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారన్నారు . ప్రజలంతా దీన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు . ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని స్పష్టంగా తెలుసన్నారు . ఎన్నికలను బహిష్కరిస్తే కుంటి , గుడ్డి సాకులను ఎత్తి చూపుతూ బహిష్కరించడం వల్లే ఓటమి ఎదురైందని చెప్పుకోవచ్చన్న ధోరణిలో చంద్రబాబు ఉన్నారన్నారు . చంద్రబాబు , ఆయన పార్టనర్ పవన్ కళ్యాణ్ వచ్చినా విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు . సీఎం జగన్మోహనరెడ్డి చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందుతున్నారన్నారు . దీనివల్ల నూటికి 70 శాతం ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారన్నారు . గతంలో ఎన్నడూ లేని విధంగా గుడ్లవల్లేరు మండలంలో జడ్పీటీసీ , ఎంపీటీసీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీలతో విజయం సాధిస్తారని మంత్రి కొడాలి నాని చెప్పారు .
ఇదిలా ఉండగా మంత్రి కొడాలి నాని దృష్టికి కవుతరం గ్రామస్థులు పలు సమస్యలను తీసుకువచ్చారు . రోడ్లు , డ్రైన్లు , మంచినీటి సౌకర్యం వంటి సమస్యల పరిష్కారంపై మంత్రి కొడాలి నాని మాట్లాడారు . కవుతరంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు . కాగా మంత్రి కొడాలి నాని ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు . ప్రచారంలో భాగంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . మసీదులోని జెండాల దగ్గర ముస్లిం మత పెద్దలతో కలిసి మంత్రి కొడాలి నాని ప్రార్థనలు చేశారు . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలేటి చంటి , పాలడుగు రాంప్రసాద్ , ఉప్పాల రాము , పార్టీ గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు శాయన రవికుమార్ , శ్రీ కొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డి , కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పడమట సుజాత , నాయకులు వడ్లమూడి నాగమోహన్ , వడ్లమూడి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు .


Comment As:

Comment (0)